

సిద్దిపేట జిల్లాలోని క్యూ నెట్ ఫ్రాడ్ కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. వర్గల్ మండలం వేలూరుకు చెందిన హరికృష్ణ క్యూ నెట్‌లో రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు ఆరోపణలు ఉన్నాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన ఆయన.. ఆ తర్వాత అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు క్యూ నెట్ తనను మోసం చేసిందంటూ హరికృష్ణ సూసైడ్ నోట్ రాసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై హరికృష్ణ తండ్రి నాగరాజు క్యూ నెట్, విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థలపై ఫిర్యాదు చేశారు.
ఈ ఏడాది మార్చిలో పోలీసులు కేసును సీఐడీకి బదిలీ చేశారు. అనంతరం క్యూ నెట్, విహన్ సంస్థల పాత్రపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గౌరారం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా సీబీఐ తాజాగా కొత్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. క్యూ నెట్, విహన్ డైరెక్ట్ సెల్లింగ్ సంస్థల డైరెక్టర్లతో పాటు మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, సంస్థల పాత్ర, మోసం జరిగిన తీరుపై దర్యాప్తు కొనసాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!