

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు కాకతీయ సామ్రాజ్య పాలకురాలు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ నేత బోయినపల్లి వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారని, తాము పలుమార్లు ప్రధానితో పాటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టు కోసం ప్రయత్నించామని వినోద్ కుమార్ తెలిపారు. బీఆర్‌ఎస్ ఏమీ చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వాస్తవ విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం బీఆర్‌ఎస్ హయాంలో చేసిన ప్రయత్నాలకు సంబంధించిన వివరాలతో పాటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసిన ఫొటోలు, వీడియోలు, వార్తా కథనాలను ముఖ్యమంత్రికి పంపుతున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. ఎయిర్‌పోర్ట్ అభివృద్ధిలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉందని, దానిని తాను కాదనడం లేదని అన్నారు. అయితే మొత్తం క్రెడిట్ తనకే దక్కుతుందని చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్ట్ కోసం భూసేకరణ పూర్తి చేసి భూమిని ఏఏఐకి అప్పగించినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌కు పేరు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రజలను కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!