

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు ఏర్పడిన అంతరాయాలతో ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాల్లో డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా, కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత కూడా కనిపిస్తోంది. అమెరికాలో డీజిల్ ధర గాలన్‌కు 6 డాలర్లకు పైగా చేరినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఫ్రాన్స్‌లో డీజిల్ సగటు ధర లీటరుకు 2.39 యూరోలు దాటగా, దేశంలోని దాదాపు తొమ్మిది శాతం ఇంధన కేంద్రాల్లో స్టాక్ కొరత ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ కొరత మరింత ఎక్కువగా ఉంది.
ఇంధన సరఫరాలో అంతరాయాలకు తోడు సౌదీ అరామ్‌కో ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై జరిగిన దాడి కూడా పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. అక్టోబర్‌కు సంబంధించిన ముడి చమురు సరఫరాను కనీసం ఇద్దరు యూరోపియన్ రిఫైనర్లకు నిలిపివేస్తున్నట్లు అరామ్‌కో సమాచారం ఇచ్చినట్లు రాయిటర్స్ తెలిపింది. మరోవైపు బ్రిటన్‌లో ఆగస్టు ద్రవ్యోల్బణం 3.1 శాతానికి చేరగా, మోటార్ ఇంధన ధరలు ఏడాది వ్యవధిలో 23 శాతం పెరిగినట్లు ఆ దేశ జాతీయ గణాంకాల కార్యాలయం వెల్లడించింది. పెట్రోల్ ధర లీటరుకు 161.3 పెన్స్‌కు, డీజిల్ 181.8 పెన్స్‌కు చేరాయి. ఈ పరిణామాలతో రవాణా, వ్యవసాయం, నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పెరుగుతోంది. భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ సరఫరా, ధరలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ, దేశంలో కొరత లేదా భారీ ధరల పెరుగుదలపై ప్రస్తుతం అధికారిక నిర్ధారణ లేదు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!