

గణేష్ చతుర్థి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూనే పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పర్యావరణహిత మట్టి గణేష్ప్రతిమలను వినియోగించి జల కాలుష్యాన్ని నివారించేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. గణేష్ చతుర్థి సందర్భంగా దేశవ్యాప్తంగా, తెలంగాణ ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణహిత వేడుకలను ప్రోత్సహించడంలో భాగంగా శుక్రవారం లోక్‌భవన్ ప్రాంగణంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా కలిసి లోక్‌భవన్ అధికారులు, ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు మట్టి గణేష్ ప్రతిమలను పంపిణీ చేశారు.
సెప్టెంబర్ 14 నుంచి గణేష్ ప్రతిమల ప్రతిష్ఠాపన, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పండుగ వేడుకల్లో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గవర్నర్ సూచించారు. నిమజ్జనం సమయంలో జల వనరులు కలుషితం కాకుండా పర్యావరణహిత పదార్థాలతో తయారు చేసిన మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు. మట్టి గణేష్ ప్రతిమలు సహజసిద్ధంగా నీటిలో కరిగిపోవడంతో జల కాలుష్యాన్ని తగ్గించేందుకు దోహదపడతాయని తెలిపారు. నీటి వనరులను కలుషితం చేసే పీవోపీ, రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణహిత వేడుకలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని, మట్టి గణేష్ ప్రతిమల ప్రాధాన్యం, జల సంరక్షణ, కాలుష్య నివారణపై విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!