

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో నెలకొన్న వరద పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ సాయిప్రసాద్ సహా అధికారులతో నివాస ప్రాంతాల్లో నీరు చేరడం, పంటలు ముంపునకు గురికావడం, నదుల్లో ప్రవాహాలు, ముంపు ప్రాంతాల్లో చేపడుతున్న పునరావాస చర్యలపై సమీక్షించారు. ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన సహాయాన్ని వేగంగా అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా నదులు, రిజర్వాయర్లలోకి నీటి ప్రవాహాలు పెరిగిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గత ఐదు రోజులుగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకార కుటుంబాలకు ఉచితంగా 50 కేజీల బియ్యం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో నదీ ప్రవాహాలు, రిజర్వాయర్ల పరిస్థితిని సమీక్షించిన ఆయన హీర మండలం లిఫ్ట్ ప్రాజెక్టుకు విద్యుత్ సౌకర్యం కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. లిఫ్ట్ పనులు పూర్తి చేసి వంశధార నీటిని రిజర్వాయర్‌లోకి తరలించాలని ఆదేశించారు. అలాగే పులిచింతల దిగువన, ప్రకాశం బ్యారేజీకి ఎగువన కొత్త బ్యారేజీల నిర్మాణానికి గతంలో చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లి కేంద్రానికి పంపాలని సూచించారు. తాజా వర్షాలతో రాష్ట్ర వర్షపాతం లోటు 50 శాతం నుంచి 31 శాతానికి తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!