

బిహార్‌లో జీతం చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ ఓ ప్రభుత్వ మహిళా అధికారి వినూత్న రీతిలో ఆందోళనకు దిగారు. ఎనిమిది నెలలుగా జీతం అందకపోవడంతో చేతిలో బిక్షాపాత్ర పట్టుకుని కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు. బక్సర్ జిల్లాలోని బ్రహ్మపూర్ బ్లాక్ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి అధికారిణి (ఆర్‌డీఓ)గా పనిచేస్తున్న అల్పితా సింగ్ ఈ నిరసన చేపట్టారు. 11 నెలలుగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం మూడు నెలల జీతం మాత్రమే అందిందని ఆమె ఆరోపించారు. జీతం అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెబుతూ రెండు రోజుల పాటు కార్యాలయం ఎదుట బిక్షాపాత్రతో నిరసన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై స్పందించిన బక్సర్ జిల్లా యంత్రాంగం జీతం చెల్లింపులో జాప్యానికి సంబంధించి సంబంధిత బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బీడీఓ) సోను కుమార్‌ను వివరణ కోరింది. అనంతరం అల్పితా సింగ్‌కు పెండింగ్‌లో ఉన్న జీతాన్ని విడుదల చేసినట్లు సమాచారం. అయితే, ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడం, బయోమెట్రిక్ హాజరులో లోపాలు, కేటాయించిన జనగణన సంబంధిత విధులను నిర్వహించకపోవడం వంటి ఆరోపణలపై అధికారులు ఆమెకు వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించారు. జీతం కోసం ప్రారంభమైన నిరసన ప్రస్తుతం అధికారిణి విధుల నిర్వహణపై విచారణకు దారితీసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!