

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 21, 22 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21న బెంగళూరు నుంచి చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లి చేరుకుని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కుప్పం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతారు. రైతు బజార్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు కుప్పం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. రూ.289.5 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, రూ.38.5 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ‘స్వర్ణ కుప్పం’ విజయాలను ప్రదర్శించే వీడియోను వీక్షించి, లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడతారు. కుప్పం కొత్తపేటలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
పర్యటనలో భాగంగా ‘స్వర్ణ కుప్పం’ అచీవ్‌మెంట్స్ గ్యాలరీని సందర్శించడంతో పాటు హిందాల్కో ప్రతినిధులతో సమావేశం కానున్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి కుప్పం రైల్వే స్టేషన్‌లో దాదర్–పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు హాల్ట్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. సెప్టెంబర్ 22న రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో చేపట్టిన రూ.9,000 కోట్ల విలువైన HAM పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి, కేడర్ సమావేశంలో పాల్గొని సాయంత్రం అమరావతికి తిరుగు ప్రయాణం కానున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!