

ఎన్నికల్లో డబ్బులు తీసుకోకుండా ఆత్మగౌరవంతో ఓటు వేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే స్త్రీశక్తి పథకం ఏడాది పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బు వారి సొంత సొమ్ము కాదని, అవినీతి మార్గాల్లో సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని మాత్రమే ఓటర్లకు ఇస్తారని చంద్రబాబు పేర్కొన్నారు. నగదు ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని, మహిళల్లో దీనిపై చైతన్యం పెరగాలని అన్నారు. కుటుంబ సభ్యులు వ్యసనాల బారినపడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.
సంకల్పబలం ఉంటే ఎవరైనా ఉన్నత స్థాయికి ఎదగవచ్చని చంద్రబాబు అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఏపీజే అబ్దుల్ కలాం, ఎన్టీఆర్, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీలను ఉదాహరణలుగా పేర్కొన్నారు. స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయట ప్రపంచాన్ని చూసే అవకాశం లభించిందన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని విజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం, గ్రామం, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి పలు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని, 2047 నాటికి ఆర్థిక అసమానతలను తొలగించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు. డ్వాక్రా సంఘాల మహిళలు రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ లక్షల కుటుంబాల అభివృద్ధికి తోడ్పడుతున్నారని ప్రశంసించారు. ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడం, ‘ఒక జిల్లా-ఒక ఉత్పత్తి’ విధానంతో స్థానిక ఉత్పత్తులను దేశ, విదేశీ మార్కెట్లకు తీసుకెళ్లడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!