

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో కలిశారు. ఈ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పీఎంఏవై-జీ పథకం కింద తొలి విడతగా తెలంగాణకు 2 లక్షల ఇళ్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. గత జూలైలో 11,56,915 అర్హ గ్రామీణ కుటుంబాలకు ఇళ్లు మంజూరు చేయాలని ఢిల్లీలో తాను సమర్పించిన వినతిపత్రాన్ని సీఎం గుర్తుచేశారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మిగిలిన 9.56 లక్షల ఇళ్లను కూడా కేటాయించాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ రంగంలో పెరిగిన విద్యుత్ వినియోగంపై రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి వివరించారు. తాగునీరు, విద్యుత్ కొరత తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు. పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందిస్తున్నామని, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామని, 250 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో పండ్లు, కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పంట మార్పిడిని ప్రోత్సహించేందుకు కేంద్రం సహకరించాలని సీఎం కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!