

మధ్య ఆఫ్రికా రిపబ్లిక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ప్రాంతంలోని నానా-మాంబెరె అబ్బా పరిధిలో బంగారు గని ఒక్కసారిగా కూలిపోవడంతో 30 మంది మృతి చెందారు. పలువురు కార్మికులు గనిలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, తోటి కార్మికులు గంటల తరబడి శ్రమించి 30 మృతదేహాలను వెలికితీశారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గనిలో చిక్కుకున్న వారిని సజీవంగా బయటకు తీసే అవకాశాలు తగ్గుతున్నాయని ప్రమాదం నుంచి బయటపడిన ఓ కార్మికుడు తెలిపాడు.
ఈ ఘటనపై మధ్య ఆఫ్రికా రిపబ్లిక్ ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించింది. గనిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది. దేశంలోని చిన్న తరహా బంగారు గనుల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు, రక్షణ చర్యలు లేకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!