

1986 డిసెంబర్ 4న ఆమోదించిన ‘రైట్ టు డెవలప్‌మెంట్’పై ఐక్యరాజ్యసమితి డిక్లరేషన్‌కు 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రూపొందించిన వీడియోలో కేరళం సాధించిన విజయాన్ని వివరించారు. 2025 నవంబర్ 1న కేరళ పిరవి వేడుకల్లో భాగంగా రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో కేరళం తీవ్ర పేదరికం నుంచి విముక్తి పొందినట్లు ప్రకటించుకుంది. ఈ ప్రకటన చేసిన దేశంలోని తొలి రాష్ట్రంగా కేరళం నిలిచింది.
పేదరికాన్ని కేవలం ఆదాయం లేకపోవడంగా కాకుండా.. అవకాశాలు, సామర్థ్యాలు, స్వేచ్ఛకు కొరతగా కేరళం నిర్వచించింది. స్థానిక స్వపరిపాలన సంస్థలు, పౌర సమాజ సంస్థలు, మహిళా సంఘాలు కలిసి పేద కుటుంబాలను గుర్తించాయి. నిరాశ్రయులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నవారు, భూమి లేదా ఇళ్లకు సంబంధించిన పత్రాలు లేనివారిని గుర్తించేందుకు దాదాపు 10 లక్షల మంది పౌరులు భాగస్వాములయ్యారు. 64 వేలకు పైగా కుటుంబాలకు వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మైక్రో ప్లాన్‌ల ద్వారా సహాయం అందించారు. ఆహార భద్రత, వైద్య సేవలు వంటి తక్షణ అవసరాలను తీర్చడంతో పాటు, ఐదేళ్లలో స్థిరమైన ఉపాధి మార్గాలు, సురక్షిత గృహాల కల్పనపై దృష్టి సారించారు. ప్రజల భాగస్వామ్యంతో సాధించిన ఈ విజయం అభివృద్ధికి ఆదర్శవంతమైన నమూనా అని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!