

సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాలవారీగా ఈవీఎంలలో నమోదైన ఓట్లను ఒకేసారి కలిపి లెక్కించే ‘టోటలైజర్’ వ్యవస్థను ప్రస్తుత చట్టాల ప్రకారం అమలు చేయడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ప్రజల్లో మరింత నమ్మకం కల్పించేందుకు టోటలైజర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని కోరుతూ యోగేశ్ గుప్తా 2014లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ అంశంపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈసీ తాజాగా తన వాదనలను సమర్పించింది. టోటలైజర్ విధానంలో ఒక నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఉపయోగించిన ఈవీఎంల కంట్రోల్ యూనిట్లను అనుసంధానించి ఓట్లను సమష్టిగా లెక్కిస్తారు. అయితే దీనిని అమలు చేయాలంటే ‘ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961’ను సవరించాల్సి ఉంటుందని ఈసీ తెలిపింది. 2008 నుంచి ఈ అంశంపై ఈసీ, న్యాయశాఖ, పార్లమెంటరీ కమిటీ మధ్య చర్చలు జరుగుతున్నాయని పేర్కొంది. 2016లో 21 రాజకీయ పార్టీలు, కేంద్ర మంత్రుల బృందం ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాయని వెల్లడించింది.
టోటలైజర్ అమలుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసి సమగ్రంగా పరిశీలించినట్లు ఈసీ తెలిపింది. ప్రస్తుతం అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో బూత్‌లవారీగా ఓట్లను లెక్కించి, పోలింగ్ ముగిసే సమయంలో నమోదు చేసే ఫాం-17సీతో వాటిని సరిపోల్చే అవకాశం ఉందని పేర్కొంది. అవసరమైతే అభ్యర్థులకు వీవీప్యాట్ స్లిప్పుల పరిశీలన, రీకౌంటింగ్ కోరే హక్కు కూడా ఉందని వివరించింది. టోటలైజర్ ద్వారా సమష్టిగా ఓట్లను లెక్కిస్తే బూత్‌లవారీ ఓట్లను పోల్చుకునే అవకాశం తగ్గి పారదర్శకతపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. 2019లో నారా చంద్రబాబునాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, అలాగే ఏడీఆర్ వర్సెస్ ఈసీఐ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన వీవీప్యాట్ ధ్రువీకరణకు సంబంధించిన ఆదేశాలను కూడా ఈసీ ప్రస్తావించింది. టోటలైజర్ విధానం అమల్లోకి వస్తే ఈ నిబంధనలను అమలు చేయడం కష్టమవుతుందని పేర్కొంది. ఇప్పటికే ఈవీఎంలపై వివిధ అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో చట్టపరమైన మార్పులు లేకుండా టోటలైజర్‌ను ప్రవేశపెడితే కొత్త వివాదాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. టోటలైజర్ వ్యవస్థను అమలు చేయాలంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం, ఎన్నికల నిబంధనల్లో సవరణలు, పార్లమెంటు ఆమోదం అవసరమని ఈసీ స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!