

నేపాల్‌కు మరోసారి భారీ వరద ముప్పు పొంచి ఉంది. దేశంలోని తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో నదుల నీటిమట్టాలు, ప్రవాహాలు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నువాకోట్, రసువా జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని జాతీయ విపత్తు ముప్పు తగ్గింపు, నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. పలు చిన్న నదుల్లో నీటిమట్టాలు పెరుగుతున్నట్లు తెలిపింది. టపుల్‌జంగ్, సుంఖువసభ, సోలుకుంభ్, ఖోటంగ్, ఓఖ్లదుంగా, రామెఛాప్, డోలఖ, సింధుపాల్‌చౌక్, కావ్రేపాలంచోక్, లలిత్‌పుర్, భక్తపుర్, కాఠ్‌మాండూ, ధాడింగ్ తదితర జిల్లాలకు కూడా వరద ముప్పు ఉందని అధికారులు వెల్లడించారు. కోశీ, నారాయణి, బాగ్‌మతి, కర్నాలి, మహాకాలి నదులతోపాటు వాటి ఉపనదుల ప్రవాహాలను పర్యవేక్షిస్తున్నారు. రసువాలోని తైమూర్‌లో నదీ ప్రవాహాన్ని నేరుగా గమనించేందుకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వరద పరిస్థితిపై నేపాల్ ఇంధనశాఖ మంత్రి బీరజ్ భక్త శ్రేష్ఠ వాతావరణ నిపుణులతో సమీక్ష నిర్వహించారు.
నేపాల్‌లో ఇప్పటికే సంభవించిన విపత్తు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. మంగళవారం నాటికి 1,050 మంది మరణించగా, మరో 4,000 మంది ఆచూకీ తెలియడం లేదని సమాచారం. గల్లంతైన వారిలో 583 మంది విదేశీయులు ఉన్నారు. సహాయక బృందాలు ఇప్పటివరకు 12,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. వర్షాలు, నదుల ఉద్ధృతి కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. జలవిద్యుత్తు ప్రాజెక్టుల సొరంగాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారత్, చైనాకు చెందిన నిపుణులు కలిసి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 280 మందిని సొరంగాల నుంచి రక్షించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, వాతావరణ మార్పులకు కారణమవుతున్న అధిక గ్రీన్‌హౌస్ ఉద్గారాలు చేస్తున్న దేశాల నుంచి పరిహారం కోరాలని నేపాల్ నిర్ణయించింది. ఇది దాతృత్వం కాదని, బాధ్యతగా అందించాల్సిన న్యాయపరమైన పరిహారమని నేపాల్ పేర్కొంది. హిమాలయాల్లో మంచు వేగంగా కరుగుతున్న నేపథ్యంలో గంగా, త్రిశూలి వంటి నదులపై ఆధారపడే దక్షిణాసియా ప్రజలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఉంటుందని ఆ దేశం ఆందోళన వ్యక్తం చేసింది. విపత్తు సమయంలో భారత్ అందించిన సాయాన్ని నేపాల్ బిలియనీర్ బినోద్ చౌధరి ప్రశంసించారు. 2015 భూకంప సమయంలో భారత్ అందించిన సహాయాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!