

శాశ్వత ఆవాసం కోసం ఓ యువ మగ పులి మహారాష్ట్రలో వందల కిలోమీటర్లు సంచరిస్తోంది. యవత్మాల్‌లోని తిపేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి బయటకు వచ్చిన ఈ పులి అడవులు, కొండలు, పంట పొలాలు దాటుతూ మధ్య మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో తిరుగుతోంది. గత రెండేళ్లుగా బీడ్, లాతూర్, ధారాశివ్, సోలాపూర్, అహిల్యానగర్ ప్రాంతాల్లో దాని కదలికలు నమోదయ్యాయి. బీడ్ జిల్లా అష్టి కొండ ప్రాంతంలో 2025 డిసెంబరు 10న తొలిసారి ఈ పులిని గుర్తించారు. 2026 జులై 27న మరోసారి అక్కడ కనిపించింది. అనంతరం బ్రహ్మగావ్‌లో ఓ పశువును వేటాడిన ఘటన తర్వాత అటవీశాఖ అధికారులు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేశారు.
జులై 20న కెమెరాలో పులి కదలికలు నమోదైన తర్వాత దాదాపు పది రోజుల పాటు దాని జాడ కనిపించలేదు. చివరకు ఆగస్టు 29న ధారాశివ్ జిల్లా వాశి తాలూకాలోని యేశ్వండీ సమీపంలో ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లో పులి చిక్కింది. ఇప్పటివరకు ఈ పులి 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తల్లి నుంచి విడిపోయిన తర్వాత యువ మగ పులులు తమకంటూ కొత్త భూభాగాన్ని వెతుక్కోవడం సహజమని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. ఒక ప్రాంతంలో పులి ఎక్కువకాలం సంచరిస్తోందంటే అక్కడ తగినంత ఆహారం, నీరు లభించే అవకాశం ఉందని అటవీ అధికారులు తెలిపారు. ఈ పులి ప్రధానంగా జింకలు, అడవి పందులు, నీల్గాయ్‌లను వేటాడుతున్నట్లు గతంలో గుర్తించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!