

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్టీసీకి మరో 3 వేల బస్సులను అద్దె ప్రాతిపదికన అందించనున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన మహిళా వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన, మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాల యాజమాన్యంలోని 553 బస్సులను ఆర్టీసీ నిర్వహణకు అప్పగిస్తూ ప్రారంభించారు.
2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం స్వయం సహాయక సంఘాల్లో 67 లక్షల మంది సభ్యులు ఉన్నారని, ఆ సంఖ్యను కోటి మందికి పెంచాలని పిలుపునిచ్చారు. మహిళలు స్థానికంగా వ్యాపార ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి రూ.2,400 కోట్లతో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు.
మహిళల సంక్షేమానికి ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం ఆర్టీసీకి రూ.10 వేల కోట్లకు పైగా చెల్లించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 27 వేల పాఠశాలల నిర్వహణ బాధ్యత మహిళలకు అప్పగించామని చెప్పారు. స్వయం సహాయక సంఘాలకు రూ.61 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలు, రూ.2 వేల కోట్ల వడ్డీ రాయితీ అందించామని వెల్లడించారు. ఈ సందర్భంగా రూ.20.34 కోట్ల బస్సుల అద్దె చెక్కు, రూ.10,700 కోట్ల ఉచిత ప్రయాణ పథక నిధులు, రూ.500 కోట్ల వడ్డీ లేని రుణ పథక చెక్కులు అందజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!