

ఎల్పీజీకి ప్రత్యామ్నాయంగా ఇథనాల్‌ను వంట ఇంధనంగా అందుబాటులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ దిగుమతుల వ్యయం పెరుగుతుండగా, దేశంలో ఇథనాల్ ఉత్పత్తి అవసరాలకు మించి ఉండటంతో దానిని వంట ఇంధనంగా వినియోగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాలసీని సెప్టెంబర్ నాటికి సిద్ధం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి ఇథనాల్ తయారవుతుండటంతో రైతులకు కూడా అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంది. ఎల్పీజీ మాదిరిగానే ఇథనాల్‌కు కూడా సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న గ్యాస్ స్టవ్‌లపై ఇది పనిచేయదు. ప్రత్యేకంగా "సూపర్ బ్లూ" ఇథనాల్ స్టవ్‌లను వినియోగించాల్సి ఉంటుంది. వాటికీ సబ్సిడీ కల్పించే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.
ఎల్పీజీ సిలిండర్ల మాదిరిగా ఇథనాల్ ఇంటికే డెలివరీ చేయరు. వినియోగదారులు డబ్బాలతో పెట్రోల్ బంకులకు వెళ్లి ప్రత్యేకంగా ఏర్పాటు చేసే ఇథనాల్ ఏటీఎంల నుంచి లిక్విడ్ రూపంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక లీటర్ ఇథనాల్‌తో దాదాపు 15 గంటల పాటు వంట చేయవచ్చని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మరోవైపు, ప్రస్తుతం ఈ-20 పెట్రోల్‌నే కొనసాగిస్తున్నామని, 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర సహాయ మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!