

2026–27 మార్కెట్ సీజన్‌లో ఎఫ్‌సీవీ పొగాకు అనుమతించిన ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. 2025–26లో 142 మిలియన్ కిలోలకు అనుమతించగా, 2026–27లో ఆ పరిమాణాన్ని 81 మిలియన్ కిలోలకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో మిగులు ఉత్పత్తి సమస్య తలెత్తకుండా చూడటమే ఈ నిర్ణయ లక్ష్యమన్నారు. అనుమతించిన పరిమాణంలోనే పంట ఉత్పత్తి చేసేలా పొగాకు బోర్డు ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తామని చెప్పారు.
ప్రస్తుత సీజన్‌లో 142 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అంచనా వేయగా, 236 మిలియన్ కిలోలు ఉత్పత్తి అయినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ అయిందన్నారు. ఇప్పటివరకు కిలోకు సగటు ధర రూ.209.83గా నమోదైందని చెప్పారు. ఎన్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో కిలోకు రూ.329, ఎస్‌ఎల్‌ఎస్ ప్రాంతంలో రూ.255, ఎస్‌బీఎస్ ప్రాంతంలో రూ.252 గరిష్ఠ ధరలు నమోదైనట్లు వివరించారు.
వేలం కేంద్రాల్లో నో-బిడ్ బేల్స్ శాతం గణనీయంగా తగ్గిందని అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో వారానికి సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మార్కెట్ అవుతోందన్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు మిగులు ఉత్పత్తి సమస్యను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. వచ్చే మార్కెట్ సీజన్‌లో అనుమతించిన పరిమాణానికే పరిమితమయ్యేలా రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!