

తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా వచ్చే ఏడాది జూన్ 27 నుంచి గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో సిద్ధమవుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం బాసర పుణ్యక్షేత్రంలో పర్యటించిన ఆయన రూ.354 కోట్లతో చేపట్టిన శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ అభివృద్ధి, నూతన నిర్మాణ పనులతో పాటు రూ.20 కోట్లతో చేపట్టనున్న పుష్కర ఘాట్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ భక్తుల సౌకర్యం, భద్రతకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పెరగనున్న రద్దీకి అనుగుణంగా పుష్కర ఘాట్లను విస్తరిస్తున్నామని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూములు, నిరంతర పారిశుధ్య నిర్వహణ, 24 గంటల ఉచిత వైద్య సేవలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
బాసరతో పాటు గోదావరి నదీ తీరంలోని మరో 12 ప్రాంతాల్లో రూ.1,000 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు ఏడాదిన్నర ముందుగానే పనులు ప్రారంభించామని తెలిపారు. పుష్కరాల సమయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సురక్షితమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని చెప్పారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!