

శ్రీశైలం మండలం సున్నిపెంట లింగాలగట్టు పాతాళగంగలో ఆదివారం మధ్యాహ్నం విషాద ఘటన చోటుచేసుకుంది. ముంబయి ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు తెలంగాణ పవర్హౌస్ ఎడమగట్టు నుంచి వినియోగించిన నీటి అవుట్లెట్ సమీపంలో గంగ స్నానానికి దిగారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు 22 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.
విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న సచిన్ రాజ్పుత్ (22), ఖాన్పూర్ గల్లాహర్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్న అభిషేక్ చతుర్వేది (29) ఒడ్డు నుంచి కొంత దూరం నదిలోకి వెళ్లారు. నీటి ప్రవాహం, లోతును అంచనా వేయలేక ఇద్దరూ కొట్టుకుపోయారు. వారి కేకలు విన్న స్థానిక మత్స్యకారులు తెప్ప సాయంతో వారిని కాపాడేందుకు ప్రయత్నించి, స్పృహ కోల్పోయిన ఇద్దరినీ ఒడ్డుకు తీసుకువచ్చారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.
అభిషేక్ చతుర్వేది చికిత్స అనంతరం కోలుకోగా, సచిన్ రాజ్పుత్ మృతి చెందినట్లు సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. ఘటన జరిగిన ప్రాంతం తెలంగాణలోని అమ్రాబాద్ మండలం ఈగలపెంట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని పోలీసులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!