

తెలంగాణ ఆర్థిక ప్రగతిలో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీ) కీలక పాత్ర పోషించనున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. టెక్నాలజీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ జీసీసీలను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోందన్నారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లైన స్నికర్స్, పెడిగ్రీ, రాయల్ కానిన్‌లకు మాతృసంస్థ అయిన మార్స్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను గురువారం మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌ను సంప్రదాయ ఐటీ సేవల కేంద్రం నుంచి ప్రపంచస్థాయి టెక్నాలజీ, ఇన్నోవేషన్, నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
ఐటీ రంగానికి ఇతర పరిశ్రమలతో అనుసంధానం కల్పించడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌లోనూ టెక్నాలజీ, పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు వివరించారు. జెన్‌పాక్ట్ సహకారంతో ఏర్పాటైన మార్స్ జీసీసీ ద్వారా ప్రస్తుతం 400 మందికి పైగా ఉపాధి లభించనుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్య వెయ్యికి చేరనుందని తెలిపారు. మార్స్ అంతర్జాతీయ కార్యకలాపాలకు అవసరమైన డిజిటల్, డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఈ కేంద్రం మరింత బలోపేతం చేయనుంది. కార్యక్రమంలో మార్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ క్లాస్ ఆగార్డ్, జెన్‌పాక్ట్ ప్రతినిధి తరుణ్ చోప్రా, అమెరికా కాన్సులేట్ జనరల్ హైదరాబాద్ ప్రతినిధి ఎమీలియా బి. స్మిత్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!