

సింగరేణి గనుల నుంచి నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువ నాణ్యత గల బొగ్గు సరఫరా కావడం వల్ల తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడిందని తాజా అధ్యయనం వెల్లడించింది. 2024 ఏప్రిల్ నుంచి 2026 జూన్ వరకు 27 నెలల కాలంలో నాసిరకం బొగ్గు కారణంగా సుమారు 9,593 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నష్టం జరిగినట్లు జెన్కో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఒడిశాలోని నైనీ గనుల నుంచి లభిస్తున్న అధిక నాణ్యత గల బొగ్గును ప్రస్తుతం తమిళనాడు విద్యుత్ కేంద్రాలకు పంపుతున్న సింగరేణి, అదే బొగ్గును తెలంగాణ ప్లాంట్లకు సరఫరా చేస్తే విద్యుదుత్పత్తి మరింత మెరుగవుతుందని జెన్కో సూచించింది. అలాగే ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా ప్రాంతం నుంచి కోల్ ఇండియా ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన బొగ్గును కూడా కొనుగోలు చేయాలని అభిప్రాయపడింది.
థర్మల్ విద్యుత్ కేంద్రాలకు కేంద్ర పర్యావరణ శాఖ నిర్దేశించిన గ్రేడ్‌కు తగ్గ బొగ్గునే వినియోగించాల్సి ఉన్నప్పటికీ, సింగరేణి నుంచి నాణ్యత లేని బొగ్గు సరఫరా పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది. 2024–25లో కేవలం 44 శాతం, 2025–26లో 27 శాతం బొగ్గు మాత్రమే నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉందని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెలలో సరఫరా చేసిన 16.78 లక్షల టన్నుల బొగ్గులో కేవలం 6.39 లక్షల టన్నులు మాత్రమే నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండటంతో విద్యుదుత్పత్తి తగ్గిపోయి, అవసరమైన విద్యుత్‌ను డిస్కంలు విద్యుత్ ఎక్స్చేంజ్ నుంచి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని జెన్కో పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!