

బిగ్‌బాస్ తెలుగు 10లో రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ హౌస్‌లో హీట్ పెంచేసింది. ‘రోప్ అండ్ థ్రెడ్’ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లను జంటలుగా విభజించి నామినేషన్స్ నిర్వహించారు. త్రిగుణ్, సృష్టి జంటగా పోటీ పడగా.. తాడును ముందుగా విప్పిన త్రిగుణ్ గొడ్డలిని అందుకుని నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించాడు. అయితే టాస్క్ కంటే ముందు నుంచే చప్పట్లు, ఫేవరిటిజం అంశంపై షాలిని చేసిన వ్యాఖ్యలు హౌస్‌లో మరో వివాదానికి దారితీశాయి.
నామినేషన్ సమయంలో కొందరు కంటెస్టెంట్లు చప్పట్లు కొడుతూ తమకు నచ్చిన వారికి మద్దతు ఇస్తున్నారని షాలిని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో వర్షిణి చప్పట్లు కొడుతున్న విషయాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మరోవైపు త్రిగుణ్ తన నామినేషన్లలో భాగంగా సుధీర్, రోహిత్‌లను టార్గెట్ చేశాడు. గ్రూప్ గేమ్, బ్రెయిన్‌వాష్, డబుల్ స్టాండర్డ్స్ వంటి అంశాలను ప్రస్తావిస్తూ వారిపై విమర్శలు చేశాడు. తాను గతంలో సేఫ్ అయిన విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ.. తనకు ప్రేక్షకుల మద్దతు ఉందనే ధీమాను వ్యక్తం చేశాడు.
సృష్టిని నామినేట్ చేసే సమయంలో గతంలో తన మాటలపై వచ్చిన విమర్శలకు త్రిగుణ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనకు ఐదుగురు చెల్లెళ్లు ఉన్నారని, మహిళల గురించి తప్పుగా మాట్లాడటం తన ఉద్దేశం కాదని చెప్పాడు. అయితే సృష్టి మాత్రం వెనక్కి తగ్గకుండా త్రిగుణ్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ‘అగ్నిపరీక్ష’ గ్రూప్ పేరుతో ఇతరులను విమర్శిస్తున్నారని, అయితే టాస్క్ సమయంలో అదే గ్రూప్‌కు చెందిన వారినే టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత తీవ్రంగా మారింది.
రోహిత్‌ను నామినేట్ చేసే సమయంలోనూ త్రిగుణ్, రోహిత్ మధ్య మాటల యుద్ధం జరిగింది. రోహిత్ ఇతరులను మ్యానిప్యులేట్ చేస్తున్నాడని త్రిగుణ్ ఆరోపించగా.. తనపై చేస్తున్న ఆరోపణలకు రోహిత్ దీటుగా సమాధానం ఇచ్చాడు. ‘గ్రూప్’ అనే మాటకు మొదట ప్రాధాన్యం ఇచ్చింది త్రిగుణ్‌నే అంటూ రోహిత్ కౌంటర్ ఇచ్చాడు. ఈ సమయంలో షాలిని చప్పట్లు కొట్టడంతో వర్షిణి మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. తాను ఉన్న చర్చకు మాత్రమే స్పందించానని షాలిని చెప్పగా.. వర్షిణి కూడా తాను ఆ చర్చలోనే ఉన్నానంటూ ఆమెకు ఎదురెళ్లింది.
ఈ వాగ్వాదం చివరకు షాలిని, వర్షిణి మధ్య వ్యక్తిగత స్థాయి గొడవగా మారింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎదురెదురుగా రావడంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. ఈ క్రమంలో వర్షిణి షాలిని గుండెపై చేయి వేసి వెనక్కి నెట్టినట్లు కనిపించడంతో.. తనను ఎందుకు తాకావంటూ షాలిని తీవ్రంగా ప్రశ్నించింది. రోహిత్ కల్పించుకుని వాగ్వాదంలో ఫిజికల్‌గా టచ్ చేయడం సరికాదని షాలినికి మద్దతుగా మాట్లాడగా.. త్రిగుణ్ మాత్రం వర్షిణికి సపోర్ట్ చేశాడు. చివరికి సృష్టి మధ్యలోకి వచ్చి ఇద్దరినీ శాంతింపజేసింది. మొత్తంగా ఈ నామినేషన్స్ ఎపిసోడ్‌లో త్రిగుణ్ వర్సెస్ రోహిత్, సృష్టి వర్సెస్ త్రిగుణ్ వివాదాలతో పాటు షాలిని-వర్షిణి ఘర్షణ ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!