

అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన చారిత్రక శాంతి ఒప్పందంతో పశ్చిమాసియాలో మూడు నెలలకు పైగా కొనసాగిన ఉద్రిక్తతలకు తెరపడింది. ఈ వారం చివర్లో ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. భారత్ సహా ప్రపంచ దేశాలు ఈ పరిణామాన్ని స్వాగతిస్తూ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆకాంక్షించాయి. ఈ ఒప్పందంతో హర్మూజ్ జలసంధిలో నౌకల రవాణా నిరాటంకంగా కొనసాగుతుందని భారత్ పేర్కొంది. ప్రాంతీయ శాంతి కోసం చేపట్టే చర్యలకు ఎప్పటికీ మద్దతు ఇస్తామని తెలిపింది.
జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. హర్మూజ్ జలసంధిని ఎలాంటి ఆంక్షలు లేకుండా తెరవాలని, నౌకల భద్రతను నిర్ధారించాలని వారు సూచించారు. అలాగే ఇరాన్ అణు, క్షిపణి కార్యక్రమాలపై ఉన్న ఆందోళనలను పరిష్కరించాలని అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అవకాశం ఉందని, ఇతర యుద్ధ ప్రాంతాలు కూడా శాంతి దిశగా అడుగులు వేయాలని ఆశాభావం వ్యక్తమైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!