

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల తొలి ఎంపికగా మారిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని హోసూరులో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో రూ.5,750 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 800 మెగావాట్ల హైబ్రిడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బ్రూక్‌ఫీల్డ్, బ్లాక్‌స్టోన్, బ్లాక్‌రాక్, EQT, TPG వంటి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలతో పాటు టాటా పవర్, సుజ్లాన్, రీన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ, వారీ వంటి ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల కోల్పోయిన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తిరిగి సాధించగలిగామని, గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందని చెప్పారు.
ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 ద్వారా 160 గిగావాట్ల స్వచ్ఛ ఇంధన సామర్థ్యాన్ని సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ తెలిపారు. సోలార్ మాడ్యూల్స్, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, ట్రాన్స్మిషన్ మౌలిక సదుపాయాలు, ఎనర్జీ స్టోరేజ్ వంటి పూర్తి క్లీన్ ఎనర్జీ సప్లై చైన్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. పత్తికొండలో 400 మెగావాట్ల సోలార్, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల విండ్ పవర్‌తో మొత్తం 800 మెగావాట్ల హైబ్రిడ్ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలో సుమారు 4,000 మందికి ఉపాధి కల్పించడంతో పాటు, 3,400 ఎకరాల పరిధిలోని 1,100కుపైగా రైతు కుటుంబాలకు దాదాపు మూడు దశాబ్దాల పాటు స్థిరమైన కౌలు ఆదాయాన్ని అందించనుందని ఆయన వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!