

దీపావళి అనంతరం వచ్చే కార్తీక శుక్ల పాడ్యమి రోజున గోవర్ధన పూజను జరుపుకుంటారు. దీనినే అన్నకూట్ పూజ అని కూడా పిలుస్తారు. 2026లో ఈ పర్వదినం నవంబర్ 10, మంగళవారం వచ్చింది. ఢిల్లీ పంచాంగం ప్రకారం కార్తీక శుక్ల పాడ్యమి తిథి నవంబర్ 9న మధ్యాహ్నం 12:31 గంటలకు ప్రారంభమై, నవంబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు ముగుస్తుంది. ఉదయం పూజా ముహూర్తం 6:40 నుంచి 8:50 గంటల వరకు ఉంటుంది. పురాణాల ప్రకారం బ్రజ్ ప్రాంత ప్రజలు వర్షాలు, పంటలు, సిరిసంపద కోసం ఇంద్రుడిని పూజించేవారు. అయితే ప్రకృతి, గోవులు, పచ్చిక బయళ్లు, గోవర్ధన గిరి తమ జీవనాధారాలని శ్రీకృష్ణుడు వారికి వివరించాడు. అందుకే ఇంద్రుడికి బదులుగా గోవర్ధన గిరిని పూజించాలని సూచించాడు. దీంతో ఆగ్రహించిన ఇంద్రుడు బ్రజ్ ప్రాంతంపై భారీ వర్షాలు కురిపించాడు. ప్రజలు, పశువులు ప్రమాదంలో పడటంతో శ్రీకృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలిపై గోవర్ధన గిరిని ఎత్తి అందరికీ ఆశ్రయం కల్పించాడు. ఏడు రోజులు, ఏడు రాత్రుల పాటు గోవర్ధన పర్వతాన్ని ధరించి వారిని రక్షించినట్లు పురాణాలు చెబుతున్నాయి. చివరకు ఇంద్రుడు తన తప్పును తెలుసుకొని అహంకారాన్ని విడిచిపెట్టి వర్షాలను ఆపాడు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడిని గోవర్ధనధారిగా భక్తులు ఆరాధిస్తున్నారు.
గోవర్ధన పూజలో అన్నకూట్ నైవేద్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజున భక్తులు వివిధ రకాల శాకాహార వంటకాలను తయారుచేసి శ్రీకృష్ణుడికి సమర్పిస్తారు. కొన్ని ఆలయాల్లో 56 రకాల వంటకాలతో ఛప్పన్ భోగ్ సమర్పించే సంప్రదాయం ఉంది. అనంతరం వాటిని భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. అలాగే పేడ లేదా మట్టితో గోవర్ధన గిరికి ప్రతీకగా చిన్న కొండను తయారుచేసి పూలతో అలంకరించడం, గోపూజ చేయడం, గోవర్ధన ప్రదక్షిణ నిర్వహించడం వంటి ఆచారాలు పాటిస్తారు. ఈ పర్వదినం కేవలం ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాకుండా ప్రకృతి పట్ల కృతజ్ఞతను చాటిచెప్పే పండుగగా కూడా నిలుస్తుంది. భూమి, నీరు, చెట్లు, పశువులు వంటి ప్రకృతి వనరుల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది. అధికారాన్ని, శక్తిని ఇతరులను రక్షించేందుకు ఉపయోగించాలనే సందేశంతో పాటు అహంకారంపై వినయం సాధించే విజయాన్ని శ్రీకృష్ణుడి గోవర్ధన ఘట్టం తెలియజేస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఆహారం, నీరు, పశుసంపదకు కృతజ్ఞతలు తెలుపుకోవడమే గోవర్ధన పూజలోని ప్రధాన ఆధ్యాత్మిక అంతరార్థం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!