

వేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల పరిసరాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణపై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. జడ్చర్ల మండలం మాచారం వద్ద జాతీయ రహదారి-44 సమీపంలోని రెండు సర్వే నంబర్లలో సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమి విలువ రూ.50 కోట్లకుపైగానే ఉంటుందని అంచనా. ఆక్రమించిన స్థలంలో పండ్ల మొక్కలు నాటి, చుట్టూ కంచె ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను అధికారులు పరిశీలించిన సమయంలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆక్రమిత భూమి పక్కనే సదరు వ్యాపారికి వెంచర్ ఉన్నట్లు, దాని కారణంగానే ప్రభుత్వ స్థలంపై కన్ను పడిందనే ఆరోపణలు ఉన్నాయి. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుని, అధికారుల సహకారంతో భూమిని ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. భార్య పేరిట కొనుగోలు చేసినట్లు కొన్ని పత్రాలు చూపుతున్నప్పటికీ.. రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడం, భూమి వ్యవసాయ భూమిగా నమోదు కాకపోవడం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. శంకరాయపల్లితండా, కావేరమ్మపేట, మాచారం ప్రాంతాల్లోనూ ప్రభుత్వ స్థలాలపై వివాదాలు, విక్రయాల ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. జడ్చర్ల హౌసింగ్‌బోర్డు కాలనీ సమీపంలో జాతీయ రహదారి పక్కన స్థలాన్ని ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!