

రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం, మత్స్య రంగ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, సహకార సంఘాల బలోపేతమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు & క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. జిల్లా మత్స్య సహకార సంఘాల అధ్యక్షులు, ప్రమోటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 వేల చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల పెంపకాన్ని మరింత విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మత్స్యకారులకు బీమా, మోపెడ్లు, రిటైల్ అవుట్లెట్లు వంటి సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు.
ప్రతి మూడు నెలలకు ఒకసారి జిల్లా మత్స్య సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సమస్యలను సమీక్షిస్తామని మంత్రి వెల్లడించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని కొనసాగించడంతో పాటు పెండింగ్ బకాయిల చెల్లింపులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన పథకంలో చేపలను చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, కోహెడలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ ఫిష్ మార్కెట్ పూర్తయిన తర్వాత ఆన్లైన్లో చేపల విక్రయాలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఇప్పటికే రూ.1.34 కోట్ల బీమా క్లెయిమ్‌లను ప్రభుత్వం పరిష్కరించిందని మంత్రి పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!