

భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలువురు వాట్సాప్ వినియోగదారులు మంగళవారం ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అనేక ఖాతాలు 'అండర్ రివ్యూ'లోకి వెళ్లడంతో చాటింగ్, వాయిస్ కాల్స్ వంటి సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దీనిపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మెటా స్పందించింది. సేవలను దుర్వినియోగం చేసే ఖాతాలను గుర్తించే భద్రతా ప్రక్రియలో భాగంగానే కొంతమంది వినియోగదారుల ఖాతాలను సమీక్షలో ఉంచినట్లు తెలిపింది. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది.
వాట్సాప్ అధికారిక నిబంధనలను ఉల్లంఘించే చర్యలు అకౌంట్ రివ్యూకు దారితీయవచ్చని మెటా స్పష్టం చేసింది. జీబీ వాట్సాప్, వాట్సాప్ ప్లస్, యోవాట్సాప్ వంటి అనధికారిక యాప్‌ల వినియోగం, ఒకే సందేశాన్ని పెద్ద సంఖ్యలో పంపించడం, థర్డ్‌పార్టీ బాట్లు లేదా ఆటోమేషన్ టూల్స్ వినియోగించడం, ఎక్కువ మంది మీ నంబర్‌ను బ్లాక్ చేయడం లేదా రిపోర్ట్ చేయడం, చట్టవిరుద్ధమైన లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను షేర్ చేయడం, అతివేగంగా భారీ సంఖ్యలో సందేశాలు పంపడం, డేటా స్క్రాపింగ్ టూల్స్ వినియోగించడం, పదేపదే ఫార్వర్డ్ మెసేజ్‌లను పంపడం, అధికారిక WhatsApp Business API లేకుండా బల్క్ బిజినెస్ మెసేజింగ్ చేయడం వంటి చర్యలపై వాట్సాప్ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!