

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం కార్చిచ్చు మంటలతో అతలాకుతలమవుతోంది. అటవీ ప్రాంతాల్లో చెలరేగిన మంటలు వేగంగా విస్తరిస్తూ వందలాది భవనాలను ధ్వంసం చేశాయి. ప్రభావిత ప్రాంతాల నుంచి వేలాది మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించగా, తాజాగా మరో 60 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు పంపించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో కార్చిచ్చు కొనసాగుతోంది. మంటలకు కారణమని అనుమానిస్తున్న స్పోకేన్‌కు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బలమైన గాలులు, పొడి వాతావరణం కారణంగా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో చర్చించిన అనంతరం వాషింగ్టన్ గవర్నర్ బాబ్ ఫెర్గూసన్ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రమాద ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ఇదే సమయంలో అగ్నిమాపక చర్యలకు అంతరాయం కలగకుండా కార్చిచ్చు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్‌ల వినియోగంపై నిషేధం విధించారు. అగ్నిమాపక విమానాలు, హెలికాప్టర్ల కార్యకలాపాలకు డ్రోన్‌లు ఆటంకం కలిగిస్తున్నాయని, ఆదివారం ఒక్కరోజే 26 సార్లు సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!