

“కలలకు ఊపిరి పోయండి.. మత్తుకు కాదు” అనే సందేశంతో యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. 2029 నాటికి మాదకద్రవ్యాల రహిత తెలంగాణను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ శాఖ, ఓయూ ఎన్‌ఎస్‌ఎస్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ‘నషా ముక్త్ భారత్’, ‘నషా ముక్త్ యువా ఫర్ వికసిత్ భారత్–2047’ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశ సమయంలోనే విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించే విధానాన్ని తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు వెల్లడించారు. నవంబర్ 14 నుంచి జనవరి 12 వరకు 60 రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, సదస్సులు, ప్రదర్శనలు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు, ర్యాలీల ద్వారా విద్యార్థులు, యువతలో చైతన్యం తీసుకురావాలని సూచించారు.
మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తుల జీవితాలనే కాకుండా కుటుంబాలను కూడా ప్రభావితం చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. వ్యసనానికి గురైన వారిని అవమానించకుండా, వారికి వైద్యం, కౌన్సెలింగ్, కుటుంబ సహకారం అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావాలని సూచించారు. తెలంగాణలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యత్వం 1.28 లక్షలు దాటిందని, జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ విభాగాల్లో 16 లక్షలకు పైగా నమోదులు జరిగాయని వివరించారు. కార్యక్రమంలో భాగంగా గవర్నర్ మాదకద్రవ్యాల వ్యతిరేక పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడంతో పాటు, ఠాగూర్ ఆడిటోరియం నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. దానకిశోర్ కూడా మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!