

బాలీవుడ్ నటి మందాకిని తన పాత వైరల్ ఫొటో చుట్టూ నెలకొన్న వివాదంపై తాజాగా స్పందించారు. దావూద్ ఇబ్రహీంతో కలిసి ఉన్న ఆ ఫొటోపై ఎన్నో ఏళ్లుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ షో కోసం తాను దుబాయ్ వెళ్లానని, అనంతరం క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వెళ్లిన సమయంలో ఆ ఫొటో తీసినట్లు తెలిపారు. దావూద్ తనను మ్యాచ్ కోసం ఆహ్వానించలేదని, ఒక నటిగా బహిరంగ కార్యక్రమాల్లో ఎంతోమందిని కలవాల్సి వస్తుందని చెప్పారు. ఆ ఒక్క ఫొటో ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని అప్పట్లో ఊహించలేదని పేర్కొన్నారు.
ఈ వివాదం తన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని మందాకిని తెలిపారు. అప్పట్లోనే తాను వచ్చిన వార్తలను ఖండించినప్పటికీ, వివాదం కొనసాగిందని చెప్పారు. 1980లలో బాలీవుడ్ చిత్రాలకు అండర్‌వరల్డ్ నుంచి నిధులు అందుతున్నాయనే విషయం తనకు తెలియదని, ఆ అంశాల గురించి తర్వాత సినిమాలు, మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నానని వెల్లడించారు. 1985లో రాజ్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్ తేరీ గంగా మైలీతో కథానాయికగా పరిచయమైన మందాకిని ఆ చిత్రం విజయంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు సింహాసనం, భార్గవ రాముడు చిత్రాల ద్వారా కూడా పరిచయమయ్యారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!