

మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) కమిషనర్ తుకారాం ముండే తన విధి నిర్వహణతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. ఆహార కల్తీ, అపరిశుభ్రమైన వంటశాలలు, అసురక్షిత ఆహార తయారీపై ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలను ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్‌పీజీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ హర్ష్ గొయెంకా అభినందించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తుకారాం ముండేను తొలిసారి కలిసిన విషయాన్ని గొయెంకా ఎక్స్‌లో పంచుకున్నారు. ఆ కార్యక్రమంలో ముండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, ప్రజలు ఆయనను కలవడానికి ఆసక్తి చూపించారని పేర్కొన్నారు. నిజాయతీ, నిబద్ధతతో పనిచేసే అధికారి ప్రజల హృదయాల్లో హీరోగా నిలుస్తారని ప్రశంసించారు.
హర్ష్ గొయెంకా ప్రశంసలకు తుకారాం ముండే వినయంగా స్పందించారు. ప్రజాసేవ అనేది ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినది కాదని, ధైర్యం, నిజాయతీతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులందరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది అధికారులు నిబద్ధతతో సేవలందిస్తున్నారని, తాను వారిలో ఒకడినేనని తెలిపారు. తనకంటే మెరుగ్గా పనిచేస్తున్నవారు చాలామంది ఉన్నారని, అయితే వారికి తగిన గుర్తింపు లభించడం లేదని అభిప్రాయపడ్డారు. ప్రజల నమ్మకం, అంచనాలే అధికారులకు అతిపెద్ద బాధ్యత అని, నిజాయతీతో కూడిన సేవ మినహాయింపుగా కాకుండా సాధారణ విధానంగా మారాలని ఆకాంక్షించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!