

ప్రపంచ చమురు సరఫరాకు అంతరాయం కలిగించేలా ఆంక్షలు విధించడం, కీలక ఇంధన రవాణా మార్గాలను అడ్డుకోవడం వంటి చర్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తీవ్రంగా ఖండించారు. ఇంధన వాణిజ్యంపై ఉద్దేశపూర్వక దాడులు చేయడం ద్వారా కొన్ని దేశాలు ధరలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న చమురు సంక్షోభం ఉత్పత్తి కొరత వల్ల ఏర్పడింది కాదని, అనిశ్చితి, సరఫరాలో అంతరాయాలు, అధిక ధరలు, ఇంధన లభ్యతలో సవాళ్లే ప్రధాన కారణాలని స్పష్టం చేశారు. జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అక్కడే ఉన్నారు. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షలు, పశ్చిమాసియా నుంచి ఇంధన సరఫరాలో అంతరాయాలు, రష్యా డీజిల్ విక్రయాలపై ఆంక్షల నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో పరస్పర ఆధారిత సంబంధాలను తక్కువగా అంచనా వేయకూడదని జైశంకర్ పేర్కొన్నారు. వంట అవసరాల కోసం భారత్‌కు నమ్మకమైన ఎల్‌పీజీ సరఫరాలు అవసరమని చెప్పారు. ఇంధన వనరుల లభ్యతను విస్తృతం చేయడంతో పాటు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, జీవ ఇంధనాలను ప్రోత్సహించాలని జీ20 దేశాలకు పిలుపునిచ్చారు. ప్రస్తుత సంక్షోభాలకు సైనిక చర్యలు పరిష్కారం చూపలేవని, సమస్యలను పరిష్కరించుకునేందుకు దౌత్యానికి అవకాశం ఇవ్వాలని సూచించారు. కీలక చమురు రవాణా మార్గాల్లో నౌకలు, నావికులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. యూఎన్‌క్లోస్ ఒప్పందం ప్రకారం నౌకాయాన స్వేచ్ఛను కాపాడటంతో పాటు దాడులను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాల వల్ల ఇంధనంతో పాటు ఆహారం, ఎరువుల సరఫరాపైనా ప్రభావం పడుతుందని హెచ్చరించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!