

వర్షపు నీటిని భూగర్భంలోకి ఇంకేలా అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఇంకుడు గుంతలు, మ్యాజిక్ పిట్ల నిర్మాణాలను రెండు రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావం, నీటి పొదుపు ఆవశ్యకతపై గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజినీర్లతో శనివారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో సింగూరు నుంచి ప్రత్యామ్నాయ తాగునీటి అవసరాల కోసం రూ.120 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇతర జిల్లాల్లో తక్షణ తాగునీటి అవసరాల కోసం రూ.కోటి చొప్పున నిధులు వెచ్చించినట్లు చెప్పారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, చేతిపంపులు, బావులు, స్థానిక నీటి వనరులను అందుబాటులో ఉంచాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!