

నగరాల్లో 40–50 అంతస్తులతో నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్మెంట్లు బయటికి ఎంతో ఆకర్షణీయంగా, విలాసవంతంగా కనిపిస్తున్నా.. వాటిలో నివసించే వారికి ఉదయం వేళ కొత్త సమస్య ఎదురవుతోంది. ఉదయం 8 గంటల నుంచి 9:30 గంటల మధ్య ఉద్యోగులు, పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఒకేసారి కిందకు రావడంతో లిఫ్ట్‌ల వద్ద భారీ రద్దీ ఏర్పడుతోంది. కొన్ని భవనాల్లో గ్రౌండ్ ఫ్లోర్‌కు చేరుకోవడానికి 10–15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతోందని నివాసితులు చెబుతున్నారు. లిఫ్ట్ వచ్చినా అప్పటికే నిండిపోయి ఉండటంతో మరో లిఫ్ట్ కోసం వేచి చూడాల్సి వస్తోంది. దీంతో ఆఫీసులకు ఆలస్యమవుతుందనే ఆందోళన ఉద్యోగుల్లో, స్కూల్ బస్సులు మిస్ అవుతాయనే కంగారు తల్లిదండ్రుల్లో కనిపిస్తోంది.
కొన్ని లిఫ్ట్‌లు సాంకేతిక కారణాలతో పనిచేయకపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. కోట్ల రూపాయలు వెచ్చించి ఫ్లాట్లు కొనుగోలు చేసినప్పటికీ, రోజూ లిఫ్ట్ కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడం తమ దినచర్యను, మానసిక ప్రశాంతతను ప్రభావితం చేస్తోందని నివాసితులు వాపోతున్నారు. భవనం ఎత్తు, ఫ్లాట్ల సంఖ్య, నివాసితుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన సంఖ్యలో లిఫ్ట్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు. నిర్దిష్ట అంతస్తుల కోసం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ లిఫ్ట్‌లు, స్మార్ట్ డెస్టినేషన్ కంట్రోల్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తే రద్దీని తగ్గించవచ్చని చెబుతున్నారు. సరైన ప్రణాళిక, నిర్వహణ లేకపోతే హైరైజ్ భవనాల్లో లిఫ్ట్ రద్దీ భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!