

శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయం. ఈ ఏడాది కుటుంబ ఆచారాన్ని బట్టి ఆగస్టు 21 లేదా ఆగస్టు 28న వ్రతం చేసుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇల్లు, వాకిలిని శుభ్రం చేసి, రంగవల్లులు, మామిడి ఆకులు, పూలతో అలంకరించాలి. పూజా సామగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
ఇంట్లో ఈశాన్య దిశలో మండపాన్ని ఏర్పాటు చేసి, బియ్యం లేదా ధాన్యాన్ని పోసి కలశాన్ని ప్రతిష్ఠించాలి. రాగి, ఇత్తడి లేదా వెండి పాత్రలో నీరు, అక్షింతలు, పూలు వేసి, మామిడి ఆకులు, ఎర్రటి వస్త్రం, కొబ్బరికాయతో పూర్ణకలశాన్ని సిద్ధం చేయాలి. అనంతరం వరలక్ష్మీ అమ్మవారిని పూలతో అలంకరించి దీపారాధన చేయాలి. ముందుగా పసుపు గణపతిని పూజించి, అనంతరం వరలక్ష్మీ దేవికి షోడశోపచారాలతో పూజ నిర్వహించాలి.
వరలక్ష్మీ వ్రతంలో తోరపూజకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అమ్మవారికి, వ్రతం చేసుకునే మహిళకు, ముగ్గురు ముత్తైదువులకు కలిపి ఐదు తోరాలు సిద్ధం చేయాలి. ప్రతి తోరానికి తొమ్మిది పోగులు, తొమ్మిది ముడులు ఉండేలా తయారు చేయాలి. పూజ అనంతరం కనీసం ముగ్గురు ముత్తైదువులకు పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, తమలపాకులు, వక్క, గాజులు తదితరాలతో వాయనం ఇవ్వాలి. అనంతరం వరలక్ష్మీ దేవి ఆశీర్వాదం కోరుతూ వ్రతకథను చదివి, మంగళహారతి ఇచ్చి పూజను ముగించాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!