

2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పీఎంకేర్స్ ఫండ్‌లో రూ.8,452 కోట్ల నిధులు ఉన్నట్లు ఆడిట్ నివేదిక వెల్లడించింది. ఈ నెల 7న పూర్తయిన ఆడిట్ ప్రకారం.. ఇందులో రూ.605 కోట్లు షెడ్యూల్డ్ బ్యాంకు సేవింగ్స్ ఖాతాల్లో, రూ.7,847 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్నాయి. 2023-24 చివరినాటికి ఉన్న రూ.7,173 కోట్లతో పోలిస్తే ఏడాదిలో నిధులు రూ.1,279 కోట్లు పెరిగాయి. 2024-25లో స్వదేశీ విరాళాలు రూ.479 కోట్లు, విదేశీ విరాళాలు రూ.92 లక్షలు, సేవింగ్స్ ఖాతాల వడ్డీ రూ.5.76 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూ.469 కోట్లు, రీఫండ్ల ద్వారా రూ.324 కోట్లు జమయ్యాయి. అదే ఏడాది వ్యయం రూ.87.85 లక్షలకు పరిమితమైంది.
2023-24లో పీఎంకేర్స్‌కు స్వదేశీ, విదేశీ విరాళాలు, వడ్డీ, రీఫండ్ల ద్వారా మొత్తం రూ.903 కోట్ల ఆదాయం వచ్చింది. పిల్లల పథకం కోసం రూ.15.37 కోట్లు, బ్యాంకు, ఎస్ఎంఎస్ ఛార్జీలకు రూ.22.43 లక్షలు ఖర్చయ్యాయి. గత ఆరేళ్లలో పీఎంకేర్స్ ఫండ్‌కు మొత్తం రూ.16,600 కోట్ల ఆదాయం రాగా, రూ.8,148 కోట్లు ఖర్చయ్యాయి. దీంతో నికర మిగులు రూ.8,452 కోట్లుగా నమోదైంది. కొవిడ్-19 వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సహాయం చేయడానికి పీఎంకేర్స్‌ను 2020 మార్చి 27న పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్టుగా నమోదు చేశారు. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంక్షేమానికి కూడా ఈ నిధులను వినియోగించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!