

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు వాయు కాలుష్య నియంత్రణకు పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ఏరియా (CURE) పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో పీఆర్‌టీ వ్యవస్థపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ నుంచి దుర్గం చెరువు, రహేజా మైండ్‌స్పేస్, బయోడైవర్సిటీ మెట్రో స్టేషన్ వరకు రద్దీగా ఉండే మార్గంలో తొలి పీఆర్‌టీ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, ఏడాది కాలంలో పనులను అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఈ మార్గంలో గచ్చిబౌలి ఐకియా సమీపంలో మల్టీలెవల్ పార్కింగ్‌తో పాటు పీఆర్‌టీ డిపోను నిర్మించాలని సీఎం సూచించారు. అదేవిధంగా ఎల్‌బీ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం, ఇందిరా పార్క్, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా రాణిగంజ్ బస్టాండ్ వరకు మరో పీఆర్‌టీ లైన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమాక్స్ మీదుగా బేగంపేటను కలుపుతూ మరో మార్గాన్ని అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. నెక్లెస్ రోడ్ పరిసరాల్లో మల్టీలెవల్ పార్కింగ్ నిర్మించి, అందులో పీఆర్‌టీ డిపోను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రయాణం మరింత సులభతరం కావడంతో పాటు ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!