

హైదరాబాద్‌లో తొలిసారిగా ఓ మెట్రోరైలు స్టేషన్ నుంచి నేరుగా రెసిడెన్షియల్ టౌన్‌షిప్‌కు అనుసంధానం చేసేలా స్కైవాక్ నిర్మించనున్నారు. ఎల్బీనగర్ మెట్రోరైలు స్టేషన్ నుంచి 3,576 ఫ్లాట్లతో నిర్మితమవుతున్న వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీకి నేరుగా చేరుకునేలా ఈ స్కైవాక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు లభించాయని వాసవి గ్రూప్ సీఎండీ యెర్రం విజయ్‌కుమార్ బుధవారం వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎన్‌ఓసీ కూడా వచ్చినట్లు తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్ పూర్తయిన తర్వాత పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.
వాసవి ఎవెన్యూస్ ఎల్‌ఎల్‌పీ, ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా అండ్ డెవలపర్స్ సంయుక్తంగా ఈ స్కైవాక్‌ను నిర్మించనున్నాయి. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ స్కైవాక్‌కు ఐఐటీ హైదరాబాద్ డిజైన్ రూపొందించింది. సెంట్రల్ మీడియన్ నుంచి ఎన్‌హెచ్-65కు ఆనుకుని ఉన్న కాలిబాటల వరకు నిర్మించనున్నారు. ఇందులో 10 ప్రధాన స్తంభాలు ఉంటాయి. ఒక్కో స్తంభం 5.94 మీటర్ల వ్యాసం, 8.64 మీటర్ల ఎత్తుతో.. 12–14 మీటర్ల దూరంలో ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తులో సర్వీస్ రోడ్డు విస్తరణకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్మాణాన్ని డిజైన్ చేశారు. స్కైవాక్‌లో ర్యాంప్, లిఫ్ట్, మెట్ల సదుపాయాలు కూడా ఉంటాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!