

సినిమాల చిత్రీకరణను ఆహ్లాదకరంగా, సృజనాత్మకంగా, నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అనువైన వాతావరణం కల్పించడం, కార్యకలాపాల్లో పారదర్శకత, ప్రపంచస్థాయి నిర్వహణ సామర్థ్యాలు రామోజీ ఫిల్మ్ సిటీ (ఆర్‌ఎఫ్‌సీ) విజయానికి ప్రధాన కారణాలని రామోజీ గ్రూప్ సీఎండీ సీహెచ్ కిరణ్ తెలిపారు. కెనడాలోని టొరొంటోలో జరుగుతున్న 51వ టొరొంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఫ్)లో భాగంగా నిర్వహించిన భారత్ పర్వ్ రిసెప్షన్‌కు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ‘భారత్ మీడియా-వినోద రంగంలో సరికొత్త అవకాశాలు’ అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో కిరణ్ మాట్లాడారు. రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ విజయేశ్వరి, ఈటీవీ ఎండీ కె. బాపినీడు కూడా చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని నిర్వాహకులు సత్కరించారు. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. టొరొంటోలోని భారత కాన్సులేట్ జనరల్‌తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. భారత్, కెనడాకు చెందిన సృజనాత్మక రంగ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
హైదరాబాద్‌లో సుమారు 2,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు గుర్తింపు పొందిందని కిరణ్ వివరించారు. అంతర్జాతీయ చిత్ర పరిశ్రమకు అవసరమైన సమగ్ర నిర్మాణ, పోస్ట్ ప్రొడక్షన్ సేవలను అందించే సామర్థ్యం ఆర్‌ఎఫ్‌సీకి ఉందన్నారు. చిత్రీకరణ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఒకే వేదికపై అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని, నిర్ణీత సమయంలో సినిమాను పూర్తి చేసేందుకు తమ సిబ్బంది 24 గంటలూ పనిచేస్తారని తెలిపారు. భారత్‌లో ఇంతకుముందు చిత్రీకరణ చేయని కెనడా, అమెరికా చిత్ర నిర్మాతలకు ఆర్‌ఎఫ్‌సీ ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా కిరణ్, విజయేశ్వరి, బాపినీడు కెనడా ఫెడరల్ సాంస్కృతిక వ్యవహారాల మంత్రి మార్క్ మిల్లర్‌ను కలిశారు. భారత్-కెనడా మీడియా, వినోద రంగాల మధ్య సహకార అవకాశాలపై చర్చించారు. టిఫ్ మార్కెట్‌లోని భారత్ పెవిలియన్ ద్వారా భారత చిత్ర నిర్మాణ సామర్థ్యాలను అంతర్జాతీయ పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సీ తన సమగ్ర చిత్ర నిర్మాణ మౌలిక వసతులను అక్కడ ప్రదర్శిస్తోంది. కెనడా చిత్ర నిర్మాతలు, స్టూడియోలు, పంపిణీ సంస్థలు భారత్‌తో కలిసి పనిచేయాలని, వేవ్స్ సమ్మిట్ 2027 వంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని భారత అధికారులు ఆహ్వానించారు. సహ నిర్మాణం, మార్కెట్ భాగస్వామ్యాలు, అంతర్జాతీయ కంటెంట్ రూపకల్పనతో పాటు యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, అంతర్జాతీయ పంపిణీ రంగాల్లో సహకారానికి అవకాశాలున్నాయని వివరించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!