

దేశంలో నిరుద్యోగ రేటు తగ్గింది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్‌పీఐ) విడుదల చేసిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ప్రకారం.. 2026 జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో నిరుద్యోగ రేటు 5.1 శాతానికి చేరింది. అంతకుముందు ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో ఇది 5.4 శాతంగా నమోదైంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గడం ఈ మెరుగుదలకు కారణమైంది. గ్రామీణ నిరుద్యోగ రేటు 4.8 శాతం నుంచి 4.3 శాతానికి తగ్గగా, పట్టణ ప్రాంతాల్లో మాత్రం 6.7 శాతం నుంచి స్వల్పంగా పెరిగి 6.8 శాతానికి చేరింది.
మహిళల ఉపాధి భాగస్వామ్యంలోనూ మెరుగుదల నమోదైంది. ఉద్యోగం చేస్తున్న లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మహిళల శాతం 33.2 నుంచి 34.7 శాతానికి పెరిగింది. వాస్తవంగా ఉపాధి పొందుతున్న మహిళల శాతం కూడా 31.3 నుంచి 32.8 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడిన వారిలో సగటున 57.9 కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు సర్వే అంచనా వేసింది. వీరిలో 40.5 కోట్ల మంది పురుషులు, 17.4 కోట్ల మంది మహిళలు ఉన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!