

కేరళకు చెందిన యువ శాస్త్రవేత్త ఆన్ సన్నీ యూరోపియన్ యూనియన్ అందించే ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్‌ను సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 32 మంది అభ్యర్థులు పోటీపడిన కఠినమైన అంతర్జాతీయ ఎంపిక ప్రక్రియలో ఆమె ఒక్కరే ఎంపిక కావడం విశేషం. మూడేళ్ల పరిశోధన కోసం ఆమెకు సుమారు రూ.1.5 కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. ఇటలీలోని రోమ్‌లో ఉన్న నికోలో కుసానో విశ్వవిద్యాలయంలో ఆమె పరిశోధనలు కొనసాగించనున్నారు. ఎముకలకు సంబంధించిన రుమటాయిడ్ వ్యాధుల నివారణ, చికిత్సలో ఉపయోగపడే బయోసెరామిక్ పదార్థాలపై ఆమె పరిశోధనలు చేయనున్నారు. ముఖ్యంగా ఎముకల పునరుద్ధరణ, కీళ్ల సమస్యలకు మెరుగైన చికిత్సా విధానాల అభివృద్ధిలో ఈ పరిశోధనలు కీలకంగా మారే అవకాశం ఉంది.
త్రిసూర్ జిల్లా నెల్లంకరకు చెందిన ఆన్ సన్నీ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. షార్జా ఇండియన్ స్కూల్‌లో ప్లస్‌టూ పూర్తి చేసిన ఆమె, దిల్లీలోని శ్రీ వేంకటేశ్వర కళాశాలలో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ, అనంతరం వెల్లూరులోని వీఐటీలో ఎంఎస్సీ కెమిస్ట్రీ పూర్తి చేశారు. డిగ్రీ సమయంలోనే పరిశోధనపై ఆసక్తి పెంచుకున్న ఆమె, బయోసెరామిక్స్ రంగంలో పరిశోధనలు ప్రారంభించారు. ఇప్పటికే చేపట్టిన పరిశోధనలను మరింత విస్తృత స్థాయిలో కొనసాగించేందుకు మేరీ క్యూరీ ఫెలోషిప్ ద్వారా ఇటలీ వెళ్లనున్నారు. ఆమె విజయం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎదగాలని కలలు కనే యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!