

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కేంద్రమంత్రి, భాజపా నేత కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఓటర్ల జాబితాల నుంచి 13 కోట్ల మంది పేర్లను తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోందని, అయితే ఆ గణాంకాల వెనుక ఉన్న వివరాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 2.80 కోట్ల మంది మరణించిన ఓటర్లుగా, 6.30 కోట్ల మంది శాశ్వతంగా వలస వెళ్లినవారిగా గుర్తించినట్లు తెలిపారు. మరో 3.01 కోట్ల మంది ఆచూకీ లేనివారిగా, 1.02 కోట్ల మంది పేర్లు డూప్లికేట్‌గా ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అర్హులైన ఓటర్ల పేర్లు తప్పుగా తొలగితే అభ్యంతరాలు, క్లెయిమ్‌ల ద్వారా సరిచేసుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే శాశ్వతంగా వలస వెళ్లినట్లు గుర్తించిన ఓటర్ల ఆచూకీని కనుగొని ఆధారాలు సమర్పించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరణించినవారి, డూప్లికేట్ ఓట్లను జాబితాలో కొనసాగించాలని కాంగ్రెస్ కోరుకుంటోందా అని ప్రశ్నించారు. పాతబస్తీ, మహేశ్వరం నియోజకవర్గాల్లో విదేశాల నుంచి అక్రమంగా వలస వచ్చినవారి ఓట్లు ఉన్నాయంటూ ఆయన చేసిన ఆరోపణలను కూడా ప్రస్తావించారు. మరోవైపు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించినప్పటికీ ఆయన పేరు ఓటర్ల జాబితాలో కొనసాగుతోందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓటమి ఎదురైనప్పుడు ఈవీఎంలపై కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఓటర్ల జాబితాల సవరణపై భాజపా, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాగ్వాదం కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!