

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) త్రిసభ్య కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో నేడు ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు, రెండు రాష్ట్రాల తాగునీరు, ఇతర అవసరాలపై ప్రధానంగా చర్చించనున్నారు.
కృష్ణా జలాలను బేసిన్ ప్రాతిపదికన 71:29 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీకి పంపిణీ చేయాలని తెలంగాణ కోరుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిలో ఏపీకి వాటా లేదని తెలంగాణ వాదిస్తోంది. కృష్ణా బేసిన్‌లో నీటిని నిల్వ చేసుకునే సదుపాయం పరిమితంగా ఉన్నందున ఉమ్మడి జలాశయాల్లో నీటిని తాగునీటి అవసరాల కోసం కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వచ్చే ఏడాది ఆగస్టు వరకు రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ ప్రజల తాగునీటి అవసరాలకు 50 టీఎంసీలు అవసరమని తెలంగాణ అంచనా వేసింది. ఇందులో శ్రీశైలం నుంచి 10 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 40 టీఎంసీలు అవసరమని తెలిపింది.
మరోవైపు తెలంగాణ, ఏపీ మధ్య 70:30 నిష్పత్తిలో నీటిని పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. అక్టోబర్ 31 వరకు తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి 47 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ విజ్ఞప్తి చేసింది. తమకు లభించే 115.70 టీఎంసీల వాటా నుంచి 47 టీఎంసీలను తాగునీటి అవసరాలకు వినియోగించుకునేందుకు కేఆర్ఎంబీ నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!