

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో సోమవారం భారీ పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది. స్టీల్ మెల్టింగ్ షాప్-1 (SMS-1) విభాగంలో ద్రవ ఉక్కును తరలిస్తున్న లాడెల్ అకస్మాత్తుగా తెగిపడి కిందపడటంతో వందల టన్నుల వేడి ఉక్కు నేలపై ఒలికిపోయింది. సుమారు 1,600 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన ద్రవ ఉక్కు వ్యాపించడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో ఒక భారీ క్రేన్ దగ్ధమవగా, విద్యుత్ కేబుళ్లు, సిగ్నలింగ్ వ్యవస్థలు, ఇతర కీలక మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు సమాచారం.
ప్రాథమిక సమాచారం ప్రకారం లాడెల్ నిర్వహణ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, విపత్తు నిర్వహణ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించగా, ప్లాంట్‌లో నిర్వహణ లోపాల వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తూ సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!