

కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ మధ్య కీలక ఆర్థిక కారిడార్‌ను మరింత బలోపేతం చేసేలా బళ్లారి-గుంతకల్లు మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,264 కోట్లు వ్యయం కానుందని, మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో ఇప్పటికే 80 శాతం అందుబాటులో ఉందని తెలిపారు. సుమారు 46 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌వర్క్ విస్తరించడంతో పాటు 99 గ్రామాలకు రైల్వే అనుసంధానం మెరుగుపడనుంది. వేదావతి నదిపై భారీ రైల్వే వంతెనతో పాటు ఏడు ప్రధాన వంతెనలు, 52 చిన్న వంతెనలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టుతో ఏటా అదనంగా 1.6 కోట్ల టన్నుల సరుకు రవాణాకు అవకాశం ఏర్పడటంతో పాటు పారిశ్రామిక, ఖనిజ, ఉక్కు, సిమెంట్, విద్యుత్ కేంద్రాలకు కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని కేంద్రం పేర్కొంది.
మరోవైపు దేశీయ రసాయన పరిశ్రమను మరింత బలోపేతం చేసేందుకు ‘భవ్య రసాయన్’ పథకానికి కూడా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా పోటీ విధానంలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో మూడు ప్లగ్-అండ్-ప్లే కెమికల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. కామన్ ఎఫ్లువెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, వ్యర్థాల నిర్వహణ, అగ్నిమాపక, భద్రతా మౌలిక సదుపాయాలు, రైల్వే-పోర్టు అనుసంధానం వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నారు. దేశంలో రైల్వే విద్యుదీకరణ వేగంగా కొనసాగుతోందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగంగా రైల్వేలు, రహదారులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు, సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు కొనసాగుతాయని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!