

తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో బదిలీలు, పోస్టింగ్లు చేపట్టింది. ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కీలక విభాగాలకు కొత్త అధికారులను నియమించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేశ్ మురళీధర్ భగవత్‌ను నియమించగా, ఇప్పటివరకు ఆ బాధ్యతలు నిర్వహించిన వీసీ సజ్జనార్‌ను తెలంగాణ ఫైర్ సర్వీసెస్, విపత్తుల నిర్వహణ, అత్యవసర సేవల విభాగాల డీజీగా బదిలీ చేసింది. మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగాల డీజీపీగా సౌమ్య మిశ్రా, జైళ్ల శాఖ డీజీపీగా స్వాతి లఖ్రా, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీపీగా చారు సిన్హాను నియమించింది. ఈ మేరకు నవంబర్ 12న సాధారణ పరిపాలన శాఖ జీఓ ఆర్టీ నంబర్ 1654ను విడుదల చేసింది.
ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) వైస్ చైర్మన్, ఎండీగా డాక్టర్ అనిల్ కుమార్‌ను నియమించింది. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాల డీజీపీగా ఉన్న ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఆర్టీసీ ఎండీగా ఉన్న వై. నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. అదనంగా పౌరసరఫరాల సంస్థ ఎండీ, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ బదిలీలతో పోలీస్ శాఖలోని అత్యున్నత స్థాయి నుంచి ఐజీ, డీఐజీ స్థాయిల వరకు పలు కీలక విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!