

ప్రముఖ మలయాళ గాయకుడు నిసార్ వయనాడ్ దుబాయ్‌లోని ఓ ఆసుపత్రిలో అకస్మాత్తుగా కన్నుమూశారు. ఆయన మృతితో యూఏఈలోని మలయాళీ సమాజం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత నెలలో సంగీత కార్యక్రమం కోసం దుబాయ్ వచ్చిన నిసార్ జ్వరం రావడంతో చికిత్స తీసుకున్నారు. రానున్న రోజుల్లో దుబాయ్, సౌదీ అరేబియాలో పలు కార్యక్రమాల్లో ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉండగా, మలయాళ సినిమాల్లో పాటలు పాడేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్‌ను పోలిన గాత్రంతో నిసార్‌కు సంగీత కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభించింది.
కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న నిసార్ పరిస్థితి శనివారం మధ్యాహ్నం విషమించడంతో దుబాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం ఆయన మరణించారు. సెప్టిసీమియా కారణంగా అవయవాలు విఫలమవడంతో పాటు శరీరంలో అసిడోసిస్ పెరగడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే 300 మందికి పైగా అభిమానులు, మిత్రులు తుది వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో జనాజా ప్రార్థనలు పూర్తి చేసి, పార్థివ దేహాన్ని కేరళలోని స్వగ్రామానికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నిసార్ అసలు పేరు నిస్సార్ అరోత్ ఇబ్రహీం. ఆయనకు భార్య షహానా నిసార్, ఇద్దరు కుమార్తెలు సింబ్రీనా, అంబ్రీనా ఉన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!