

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఏర్పాటైన టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీ (టీఓసీ), మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ భవిష్యత్తుపై తుది నిర్ణయాన్ని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తీసుకోవాలని సూచించింది. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి మళ్లీ నిర్మించాలా? లేక రాఫ్ట్‌ను పూర్తి స్థాయి నీటిమట్టం వరకు పెంచి, గేట్లు లేని నాన్ఓవర్ఫ్లో సెక్షన్‌గా మార్చాలా? అనే రెండు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని పేర్కొంది. ఈ రెండు ప్రతిపాదనలకు సంబంధించిన సమగ్ర డిజైన్లతో పాటు ఆర్సీసీ డయాఫ్రం వాల్, స్టిల్లింగ్ బేసిన్ ఎత్తు పెంపునకు సంబంధించిన పూర్తి గణాంకాలు, సాంకేతిక లెక్కలను సీడబ్ల్యూసీకి సమర్పించాలని సూచించింది. వాప్కోస్ నివేదిక ప్రకారం మేడిగడ్డ బ్యారేజీని సెకనుకు 82 వేల క్యూమెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకునేలా రూపొందించారు. అయితే సీడబ్ల్యూసీ అధ్యయనాల ఆధారంగా ఈ సామర్థ్యాన్ని 72 వేల క్యూమెక్కులకు తగ్గించాలని డిజైనర్ సంస్థ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను నీటిపారుదల శాఖ కేంద్ర జల సంఘానికి పంపింది. ఇప్పటికే ఆమోదించిన డిజైన్‌లో వరద ప్రవాహ సామర్థ్యాన్ని తగ్గించాల్సిన అవసరం ఏమిటని, అందుకు ప్రాతిపదిక ఏమిటని టీఓసీ ప్రశ్నించింది. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత సీడబ్ల్యూసీనే తుది నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
బ్యారేజీ పునరుద్ధరణ పనులు ప్రారంభించే ముందు సమగ్ర డిజైన్లు, అంచనాలు, సాంకేతిక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని టీఓసీ సూచించింది. సీడబ్ల్యూసీ పరిశీలించి ఆమోదం తెలిపిన తర్వాతే పనులను ముందుకు తీసుకెళ్లాలని పేర్కొంది. నవంబరులో పునరుద్ధరణ పనులు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, అప్పటిలోగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కమిటీ ఛైర్మన్ సమీర్‌కుమార్ శుక్లా సూచించినట్లు సమాచారం. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అన్ని సాంకేతిక అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలిసింది. బుధవారం దిల్లీలో సమీర్‌కుమార్ శుక్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి పరీక్షిత్ మెహ్రా, ఈఎన్సీ రమేశ్‌బాబు, కేంద్ర సంస్థల అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ఏడో బ్లాక్ పునరుద్ధరణ విధానం సీడబ్ల్యూసీ సాంకేతిక పరిశీలన, తుది ఆమోదంపై ఆధారపడి ఉంటుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!