

హైదరాబాద్‌లో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, హైడ్రా, విద్యుత్, పోలీస్, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. నగరంలో ఎక్కడా నీరు నిలిచిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండే పరిస్థితి ఏర్పడితే గేట్లు తెరిచి మూసీ నదిలోకి నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని సూచించారు.
వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో గణేష్ మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని మంత్రి తెలిపారు. మ్యాన్‌హోల్స్, నాలాల వద్ద డీ-సిల్టింగ్ పనుల నుంచి వెలువడిన పూడిక, మట్టి, రోడ్లపై ఉన్న వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఎయిర్‌టెక్ యంత్రాలు, వర్షాకాల అత్యవసర బృందాలను పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచాలని సూచించారు. అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని స్పష్టం చేశారు. “అలెర్ట్‌గా ఉందాం.. అలెర్ట్‌గా ఉంచుదాం. ప్రజల భద్రత కోసం సమన్వయంతో పనిచేద్దాం” అని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!